ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యా కమిటీ చైర్మన్‌లు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచించారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విద్యా కమిటీ నిర్వహణపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్‌లు మాట్లాడుతూ, విద్యామంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో తాము శిక్షణ పొందుతూ విద్యా వ్యవస్థను సమర్థంగా నిర్వహించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యాశాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన నాయకత్వంలో విద్యాశాఖ అభివృద్ధి దిశగా పలు కీలక చర్యలు చేపడుతోందని ప్రశంసించారు.
ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ప్రతి విద్యార్థి, లబ్ధిదారునికి చేరేలా విద్యా కమిటీ చైర్మన్‌లు బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, నాణ్యత పెంపొందించడంలో చైర్మన్‌లు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.


