విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని NDA పాలకులపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, దాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం సంపూర్ణ అమలే సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధించే మార్గమని పేర్కొన్నారు.
దళిత బహుజన సమాజం రాజకీయ శక్తిని సాధించకుండా ఉంటే బానిసత్వం తప్పదని, అన్ని రంగాల్లో ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఇవ్వగల నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, యూత్ విభాగం ప్రతినిధులు, న్యాయవాదులు, మహిళా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


