ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: బహుజన సేన ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షుడు మత్తే బాబి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సంఘ కార్యాలయం మరియు విజయదుర్గా గార్డెన్స్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, “జై భీమ్” నినాదాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సత్యనారాయణ మాట్లాడుతూ, బహుజన సేన సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం అని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు సమాజంలోని అసమానతలను తొలగించడానికి చేసిన పోరాటాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మరో ముఖ్య అతిథి, మాలమహాసేన జాతీయ అధ్యక్షుడు ఆలగ రవికుమార్ మాట్లాడుతూ, బహుజన సేన ఏర్పాటైనప్పటి నుంచి మత్తే బాబి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కుల, మత భేదాలకు అతీతంగా సమాజ సేవ చేయడం గొప్ప విషయమని తెలిపారు.
ఈ సందర్భంగా మత్తే బాబి మాట్లాడుతూ, అంబేద్కర్ గారు ఒక కులానికి మాత్రమే చెందని మహానుభావుడు అని, ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి గొప్పగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మజ్జిగ, ఫలహారం పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో డాక్టర్ ఆర్. శ్రీనివాసరావు, అర్జా రవికుమార్, మత్తే కుమార్, మావూరి పరమేశ్వరరావు, కమ్మిలి నాగార్జున, గేరా అబ్రాహాము, కైలా జోసెఫ్, రాపాక రాజు, యడ్ల రాజు, బోడా కిరణ్, తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


