తాజా వార్తలు

10/recent/ticker-posts

చింతలపూడిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు


చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల తరఫున కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తోందని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతులకు అందిస్తున్న మద్దతు వంటి పలు రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడంలో ముఖ్యమంత్రి గారి కృషి విశేషమని, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, “నేను ఆయనను చూస్తూ పెరిగాను. ఆయన ఇచ్చిన అవకాశంతోనే విదేశాలకు వెళ్లగలిగాను. అదే ప్రేరణతో ఈరోజు మీ ఎమ్మెల్యేగా మీ ముందున్నాను” అని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.

ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుతూ, ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.