తాజా వార్తలు

10/recent/ticker-posts

సేంద్రియానికి “బ్రాండ్” జోడిస్తే… రైతు జీవితమే మారుతుందా? కలెక్టర్ కీలక పిలుపు


ఏలూరు, ఏప్రిల్ 10: సహజ–సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ప్యాకింగ్, లేబెలింగ్, బ్రాండింగ్, సర్టిఫికేషన్ అంశాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.


సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ కల్పిస్తే మంచి ధర లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని అన్నారు. ప్యాకింగ్, లేబెలింగ్, సర్టిఫికేషన్‌పై పూర్తి అవగాహన ఉంటే రైతులు అధిక లాభాలు పొందగలరని స్పష్టం చేశారు.

ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఏలూరులో 200 మంది రైతులతో, 250 రకాల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డీసీఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో రైతు సంపద ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక దుకాణం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతులు తమ ఉత్పత్తులను వీడియోల రూపంలో ప్రచారం చేస్తే మార్కెటింగ్ మరింత పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు లాభాలు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తాను కూడా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నానని తెలిపారు.

సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అనుమతులు పొందే విధానంపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. దూర ప్రాంతాలకు ఉత్పత్తులను పంపిణీ చేయడానికి కార్గో, పార్సిల్ సేవలను సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.