ఏలూరు, ఏప్రిల్ 10: జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న నిర్మాణ పనుల్లో జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావుతో కలిసి వివిధ శాఖల పనుల పురోగతి, పన్నుల వసూళ్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పన్నుల సేకరణలో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు.
జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.220 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్, రహదారులు & భవనాలు, ఇరిగేషన్, గృహ నిర్మాణ శాఖల ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనుల కోసం కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో, వాటికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటివరకు చెల్లించిన నిధుల వివరాలను సంబంధిత శాఖలు వెంటనే వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత ఉండాలని, ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం కనబరిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్ల నుంచి జీఎస్టీ వసూళ్లపై కూడా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్ల లావాదేవీలు, చెల్లింపులు పూర్తిగా నమోదు కావాలని, ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ & బి శాఖలకు చెందిన ఎస్ఈలు దేవప్రకాష్, రమేష్, త్రినాథ్ బాబు, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు కూడా సమావేశంలో హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.


