తాజా వార్తలు

10/recent/ticker-posts

మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై ఉద్యమం – ఐఎఫ్‌టీయూ పిలుపు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో 140వ మేడే పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది.


ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 140 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో కార్మికులు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలతో సాధించిన 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్ల పేరుతో తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 10 నుంచి 12 గంటల పని దినాలను అమలు చేయాలనే ప్రయత్నాలు కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.

మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఐకమత్యంతో ముందుకు రావాలని, లేబర్ కోడ్ల రద్దు కోసం ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకోవడం అత్యవసరమని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పోరాటం చేయాలని సూచించారు.

నగరంలో దాదాపు 70 కేంద్రాల్లో మేడే సందర్భంగా పతాకావిష్కరణలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలని ఐఎఫ్‌టీయూ నగర కమిటీ నిర్ణయించింది. కార్యక్రమంలో నగర అధ్యక్షులు బి. సోమయ్య అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, ధన్నాన విజయ్, ఎన్. నెహ్రు బాబు, ఎల్. సత్యనారాయణ, లింగమల్లు శ్రీనివాసరావు, డి. రత్నబాబు, కే. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.