ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కె. రామకృష్ణ, ఎస్సై జ్యోతిబసు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలపై వేధింపులు, గృహహింసను అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాల గురించి అధికారులు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేస్తూ, అలాంటి చర్యలకు పాల్పడే తల్లిదండ్రులు, సహకరించే పెద్దలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్న వయస్సులో వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం 112 (పోలీస్), 181 (మహిళా హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) నంబర్లను ఉపయోగించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలు, OTPలు చెప్పవద్దని హెచ్చరించారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చట్టంపై అవగాహన పెంపుతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు స్థానికులు పాల్గొన్నారు.


