ఆలమూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: మండలం చింతలూరులో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు నామాల శ్రీనివాసు 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత మజ్జిగ చలివేంద్రం ఘనంగా ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, వాహనదారులు, అలాగే శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుమారు రూ.20 వేల విలువైన 25 బకెట్ల మజ్జిగను మూడు వేల మందికి అందజేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. నామాల శ్రీనివాసు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని పలువురు నేతలు కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నేలపూడి రత్నకుమారి, నూకపెయ్యి సూరిబాబు, మార్గని యేసు, మోటుపల్లి వెంకన్న, ఈదల తేజ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


