తాజా వార్తలు

10/recent/ticker-posts

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గ్రంథాలయాలు కీలకం: బాలనాగు విజయ సారథి


భీమడోలు గ్రంథాలయంలో ఉత్సాహంగా సాగిన వేసవి విజ్ఞాన శిబిరం


భీమడోలు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు బాలనాగు విజయ సారథి పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో బుధవారం నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరం రెండో రోజు కార్యక్రమం ఉల్లాసభరిత వాతావరణంలో జరిగింది. గ్రంథపాలకుడు కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తుమ్మల ఉమామహేశ్వరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ మండే సుధాకర్, ఉమామహేశ్వరులు పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, విద్యార్థులకు నీతి కథలు చెప్పారు. ముఖ్యంగా “చెడు సహవాసం” అనే కథను సుధాకర్ వివరిస్తే, విద్యార్థులు కూడా పలు నీతి కథలు చెప్పి శిబిరాన్ని ఉత్సాహపరిచారు. శిబిరాన్ని సందర్శించిన బాలనాగు విజయ సారథి విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ, “అమ్మను మించిన దైవం లేదు” అని, ప్రతి విషయంలో తల్లిని గౌరవించాలని సూచించారు.

అధ్యక్షులు టీవీ ఉమామహేశ్వరావు, మండే సుధాకర్ మాట్లాడుతూ వేసవి శిక్షణ తరగతులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని, టీవీ, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం పెంచుకోవాలని సూచించారు. ఈ శిబిరం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం డాక్టర్ సత్యం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 50 మంది చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, తల్లిదండ్రులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.