తాజా వార్తలు

10/recent/ticker-posts

అంబేద్కర్ ఆశయాలకు పునరంకితం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు


కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వాడపాలెం పెదపేట, కొత్తపేట బస్టాండ్ సెంటర్, రెడ్డీపవారిపేట, కమ్మిరెడ్డిపాలెం మరియు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించేందుకు ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. నేడు సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లేనని అన్నారు.

అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన నిరూపించారని తెలిపారు. సమాన హక్కులు, ఓటు హక్కు ద్వారా ప్రజల చేతుల్లోనే అధికారాన్ని ఉంచిన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి మార్గదర్శకమని చెప్పారు. “బోధించు–సంఘటించు–పోరాడు” అనే అంబేద్కర్ సందేశం నేటికీ ఆచరణీయమని అన్నారు.

అలాగే నందమూరి తారక రామారావు గారి పాత్రను ప్రస్తావిస్తూ, ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న సమయంలో అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి కోనసీమ ఆర్చ్ వరకు వెళ్లి అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు తదితర నాయకులు పాల్గొన్నారు.