తాజా వార్తలు

10/recent/ticker-posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 05: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఏలూరులో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన జాయింట్ కలెక్టర్, డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష నిర్మూలన కోసం అహర్నిశలు పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించిన ఆయన, వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారని తెలిపారు. ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపన ద్వారా దేశంలో ఆహార భద్రతకు బలమైన పునాది వేశారని వివరించారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి, వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందారని అన్నారు.

డా. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళా విద్యపై ఆయన చూపిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, స్త్రీలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై. విశ్వమోహన్ రెడ్డి, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పలు ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు, సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.