తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 05: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఉప గ్రంథపాలకులు ఎ. నారాయణరావు ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా సభను నిర్వహించారు.

ఉప గ్రంథపాలకులు మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని అర్ర సమీపంలోని చందువా గ్రామంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్, భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహానేత అని తెలిపారు. ఆయన తొలి కేబినెట్ కార్మిక మంత్రిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, అలాగే నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ కేంద్ర శాఖల కేబినెట్ మంత్రిగా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.

1975-77 అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచిన ఆయన, తరువాత 1977లో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ కూటమిలో చేరి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ద్వారా భారత ఉపప్రధానమంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. అనంతరం 1981లో భారత జాతీయ కాంగ్రెస్ (జె) పార్టీని స్థాపించారని వివరించారు.

బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను అనుసరించి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఉప గ్రంథపాలకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, మీడియా ప్రతినిధులు పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.