ఆంధ్రప్రదేశ్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం కొందరి అక్రమ సంపాదనకు మార్గంగా మారుతోంది. ముఖ్యంగా కొండపల్లి కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. గతంలో కేవలం బియ్యం తరలింపుతో పరిమితమైన ఈ నెట్‌వర్క్, ఇప్పుడు వ్యవస్థలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగి “మాఫియా 2.0”గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ మాఫియా వెనుక భారీ నెట్‌వర్క్ పనిచేస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. కొందరు డీలర్లు, బ్రోకర్లు, రాజకీయ మద్దతుదారులు కలిసి వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న ప్రయోజనాల కోసం కొందరు అధికారులు కూడా మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాకినాడ పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. సముద్ర మార్గంలో జరుగుతున్న ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు స్థానిక నాయకుల మద్దతుతో లారీలు సరిహద్దులు దాటుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వాలు మారుతున్నా, క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు, బ్రోకర్లు, రాజకీయ నాయకుల మధ్య ఉన్న అనుబంధం మాత్రం మారడం లేదని ప్రజలు అంటున్నారు. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో బయటపడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ “రేషన్ మాఫియా 2.0” నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకుని, పూర్తిగా నిర్మూలించగలదా అన్నది ప్రశ్నగా మారింది. పేదల హక్కులను దోచుకుంటున్న ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.


