ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో జ్యువెలరీ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ ఎం. చిరంజీవి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నేరాల నివారణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి దుకాణం వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా చిత్రాలు రికార్డు అయ్యే నైట్ విజన్ కెమెరాలు, కదలికలను గుర్తించే మోషన్ సెన్సార్ కెమెరాలను వినియోగించాలని సూచించారు. కెమెరాల రికార్డింగ్ కనీసం 30 రోజుల వరకు భద్రంగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
దుకాణాల వద్దకు వచ్చే వినియోగదారులు వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తుచేశారు. వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. అలాగే షాపుల్లో పనిచేసే సిబ్బంది వివరాలను పోలీసులకు అందజేయాలని, నగదు లేదా నగల రవాణా సమయంలో తగిన భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.
వ్యాపారులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తేనే నేరాల నివారణ సాధ్యమవుతుందని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. సురక్షిత వ్యాపార వాతావరణం ఏర్పడేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.


