తాజా వార్తలు

10/recent/ticker-posts

విపత్తు నివారణలో అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: విపత్తుల సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి నష్టాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు.


బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు రూ.2 కోట్ల విలువైన ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు వాహనాలు, బోట్లు, డ్రాగన్ లైట్స్ వంటి పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణలో అగ్నిమాపక శాఖ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. రాష్ట్ర విపత్తు నివారణ దళంగా పనిచేస్తున్న ఈ శాఖ అధికారులు వేగంగా స్పందించి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అగ్నిమాపక శాఖకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఆధునిక వాహనాలు, పరికరాలు అందించిందని పేర్కొన్నారు. వీటి సహాయంతో ప్రమాద సమయంలో త్వరితగతిన స్పందించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించవచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాలో అగ్నిమాపక భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక భద్రతపై ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.