తాజా వార్తలు

10/recent/ticker-posts

మిషన్ వాత్సల్య అమలుపై సమీక్ష – లైసెన్సు లేని చైల్డ్ కేర్ హోమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: జిల్లాలో బాలల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి సూచించారు. జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ వాత్సల్య పథకపు మొదటి త్రైమాసిక సమన్వయ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నివేదికలను సమీక్షించారు.


కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలలకు అందించే సేవలు మిషన్ వాత్సల్య ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. లైసెన్సు లేకుండా ఎలాంటి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఆశ్రయం కల్పించే ప్రతి హోమ్ జిల్లా పరిపాలన అనుమతి పొందాలి అని, అటువంటి సంస్థలను పోలీసులు, డిసిపియు మరియు సంబంధిత శాఖలు కలిసి తనిఖీలు నిర్వహించి పూర్తి నివేదికలు సమర్పించాలని తెలిపారు.

దత్తత, ఫోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. “ఊయల” కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనాథలు లేదా తల్లిదండ్రులు వదిలిపెట్టే పరిస్థితుల్లో ఉన్న శిశువులను రక్షించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అటువంటి శిశువులను చెత్త కుప్పల్లో లేదా డ్రైనేజీల్లో పడేయకుండా ఊయల కేంద్రాల్లో వదిలితే వారి వివరాలు గోప్యంగా ఉంచి, ప్రభుత్వ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ ద్వారా మంచి భవిష్యత్తు కల్పిస్తామని తెలిపారు.

బాలల రక్షణలో భాగంగా భిక్షాటన చేసే పిల్లలు, చెత్త సేకరించే పిల్లలను గుర్తించి సంబంధిత శాఖలు సమన్వయంతో వారిని రక్షించి సంక్షేమ హాస్టళ్లలో చేర్పించాలని ఆదేశించారు. విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు అందించి వారి భవిష్యత్తును మెరుగుపరచాలని సూచించారు. ఏదైనా బాలల సమస్యలు గమనించిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా డిసిపియు కార్యాలయానికి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా “బాలల హక్కులు కాపాడడం మనందరి బాధ్యత” అనే బుక్లెట్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. బాలల హక్కులు, ఫాక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, దత్తత విధానాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా బాలల హక్కులు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పి యు. రవిచంద్ర, సిఐ ఎం. సుబ్బారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, హైమావతి, రాజేశ్వరరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. శారద, మిషన్ కోఆర్డినేటర్ తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, డిపిఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.