తాజా వార్తలు

10/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహణ


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 05: పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం లో ఆదివారం సహస్ర కలశాభిషేకం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి వేలవిభూతులను స్మరిస్తూ హరిద్ర జలం, కుంకుమ, విభూది, గంధ జలాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.


ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యుద్ధాలు, వాటి ప్రభావాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి, సర్వమానవాళి శాంతి, సౌఖ్యాలతో జీవించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్తలు ఈమని శశి కుమార్ శర్మ, కే.ఎల్.ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ అమ్మవారి శక్తి అపారమైందని, విశేష పూజలు జరుగుతున్న సమయంలో ప్రకృతిలో కనిపించే మార్పులు దైవసన్నిధిని సూచిస్తాయని తెలిపారు. అభిషేక సమయంలో ఆకాశం మేఘావృతం కావడం వంటి సంఘటనలను భక్తులకు వివరించారు.

అనంతరం ఆలయ ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించారు. వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పణతో పాటు పంచఆరతులు, నక్షత్ర ఆరతి, నాగ ఆరతి, సింహ ఆరతి, కుంభ ఆరతి వంటి ఏకాదశ ఆరతులు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చిట్లూరి సుబ్బారావు, అబ్బిన కాశీ విశ్వనాథ్, మహిళా కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.