ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని హెచ్.జె. దొర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా కలిసి ఫిర్యాదుదారుల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు.
ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 41 ఫిర్యాదులు అందగా, వీటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించినవి అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్ట ప్రకారం వెంటనే విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని సూచించారు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చని ఎస్పీ సూచించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పించబడింది.


