తాజా వార్తలు

10/recent/ticker-posts

క్రైస్తవుల శాంతి ర్యాలీ.. దాడులపై నిరసన, డిమాండ్ల వెల్లువ


డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: నియోజకవర్గంలో క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొని ఐక్యతను చాటారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ ర్యాలీ శాంతియుతంగా కొనసాగింది.


రావులపాడు భాస్కర్ రెస్టారెంట్ వెనుక ఉన్న మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారి మీదుగా రావులపాలెం తహసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని నినాదాలు చేశారు. మతం మారితే కులం మారే విధానాన్ని సవరించాలని, 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం నిరసనకారులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ బి.ఎం. ముక్తేశ్వరరావు, టౌన్ సీఐకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.