తాజా వార్తలు

10/recent/ticker-posts

ఖతర్‌లో చిక్కుకున్న యానం మహిళకు ఊరట.. కలెక్టర్ చొరవతో స్వదేశానికి రప్పింపు


యానాం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: ఖతర్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యానాం ప్రాంతానికి చెందిన మహిళను జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రత్యేక చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. ఈ చర్యతో బాధితురాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగా, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కోనసీమ వలసదారుల కేంద్రం కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది.


వివరాల్లోకి వెళితే, దరియాలతిప్పకు చెందిన దండు ప్రోలు వీరవేణి ఉపాధి కోసం 2025 మార్చిలో ఏజెంట్ పి. ఆదినారాయణ ద్వారా ఖతర్‌కు వెళ్లారు. అక్కడ ఒక ఇంటిలో పనికి చేరిన అనంతరం, ఆమెకు తెలియకుండానే సౌదీ అరేబియాకు తరలించారు. అక్కడ ఆమెకు తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులు ఎదురవడంతో పాటు, సరైన ఆహారం కూడా అందక దారుణ పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చింది. పని ఒత్తిడి తట్టుకోలేక తన కుటుంబ సభ్యులకు బాధను తెలియజేసి సహాయం కోరింది.

బాధితురాలి పరిస్థితిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించగా, ఆయన వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత బృందం రంగంలోకి దిగి ఏజెంట్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపి, అవసరమైన ఒత్తిడి తీసుకువచ్చి వీరవేణిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో విజయవంతమైంది.

ఈ సందర్భంగా కోనసీమ వలసదారుల కేంద్రం సమన్వయ అధికారి మాట్లాడుతూ, ఒక మహిళ ప్రాణాలను కాపాడటంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చొరవ ప్రశంసనీయమని తెలిపారు. బాధితురాలిని పరామర్శించిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు మరోసారి గుర్తుచేశారు.