ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు యువతను చైతన్యవంతం చేయడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో లక్కవరం గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం.వి. సుభాష్ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్ఐ జబ్బీర్ మరియు పోలీసు సిబ్బంది గ్రామ యువతతో నేరుగా మమేకమై, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అమలులోకి వచ్చిన నూతన చట్టాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు.
ప్రత్యేకంగా ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ షేరింగ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ పొందే మార్గాలపై యువతకు సూచనలు ఇచ్చారు. సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచిస్తూ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. నేరరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



