తాజా వార్తలు

10/recent/ticker-posts

పోక్సో కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష – బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం


కైకలూరు/మచిలీపట్నం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2016లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మచిలీపట్నం స్పెషల్ పోక్సో సెషన్స్ కోర్టు కఠిన శిక్ష విధించింది. గౌరవ న్యాయమూర్తి శ్రీ గాజుల వెంకటేశ్వర్లు తీర్పు వెలువరిస్తూ ముద్దాయి బెల్లాని నాని అలియాస్ యుగ నాగేంద్రానికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.


ఈ కేసు 30-09-2016న కైకలూరు టౌన్ వెలంపేట ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించినది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.డి. షబ్బీర్ అహ్మద్ కేసు నమోదు చేయగా, అప్పటి ఇన్‌చార్జ్ సీఐ ఎం.వి.ఎన్. శివాజీ రావు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం సీఐ వి. రవి కుమార్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ నేతృత్వంలోని కోర్టు మానిటరింగ్ సెల్ కీలక పాత్ర పోషించింది. ఎస్డీపీఓ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు సాక్ష్యాధారాలను సమగ్రంగా సమర్పించారు. సి.ఎం.సి ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, హెచ్‌సి ఎం. శ్రీనివాసరావు, డబ్ల్యూ.ఏఎస్‌ఐ పద్మజ తదితరులు సాక్షులను కోర్టులో హాజరుపరచి విచారణకు సహకరించారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వి. నరసింహారావు బలమైన వాదనలు వినిపించి కేసును విజయవంతంగా నడిపించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు, కైకలూరు టౌన్ సీఐ ఏ.వి.ఎస్. రామకృష్ణతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

నేరస్తులకు కఠిన శిక్షలు పడటం ద్వారా సమాజంలో నేరాలు తగ్గుతాయని, బాధితులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.