తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎర్రమట్టి దందాపై హెచ్చరికలు – గిరిజన చట్టాల ఉల్లంఘన సహించం: బత్తిన రామకృష్ణ


దేవీపట్నం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ ఎర్రమట్టి అక్రమ రవాణా కొనసాగితే కఠిన చర్యలు తప్పవని మానవ హక్కుల ఫౌండేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ హెచ్చరించారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని దేవీపట్నం మండలంలో ఎర్రమట్టి దందాకు కొందరు రాజకీయ దళారులు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు.


దేవీపట్నం మండలాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమ తవ్వకాలు నిర్వహిస్తూ, నిబంధనలను పక్కనబెట్టి మైదాన ప్రాంతాలకు ఎర్రమట్టిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు ప్రభావశీలుల ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పేర్కొంటూ, ఇది గిరిజన హక్కులకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు.

ప్రత్యేకంగా 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనులను అడ్డుపెట్టుకుని అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, అటవీ శాఖలు మరియు విజిలెన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గిరిజనుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత అని బత్తిన రామకృష్ణ పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.