తాజా వార్తలు

10/recent/ticker-posts

కొప్పాకలో వేలాంగిణి మాత వార్షికోత్సవంలో ఎమ్మెల్యే చింతమనేని – మందిర అభివృద్ధికి హామీ


పెదవేగి (కొప్పాక), పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: అధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో జరిగిన వేలాంగిణి మాత 13వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాంగిణి మాతకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.


వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొప్పాకలోని వేలాంగిణి మాత మందిర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో షెడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహకారంతో త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ విశ్వాసులు, సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఆప్యాయంగా స్వాగతించారు. ఎమ్మెల్యే కూడా వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. విచారణ గురువులు, సంఘ పెద్దలు వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.

అనంతరం గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విచారణ గురువులు, సంఘ పెద్దలు, కూటమి నాయకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.