ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 08: ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్/ఏఎస్ఐల కోసం ఎస్సై పదోన్నతులకు అవసరమైన ఫ్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఈరోజు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం పరిధిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ పర్యవేక్షించగా, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
ఈ పరీక్షల్లో భాగంగా సిబ్బందికి టర్న్ అవుట్, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, ఆయుధాల నిర్వహణ, వైవా, నేర స్థల పరిశీలన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇన్వెస్టిగేషన్, మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సైంటిఫిక్ ఎయిడ్స్, క్రైమ్ నివారణ మరియు నిరోధక చర్యలపై అభ్యర్థుల ప్రతిభను అంచనా వేశారు.
ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలకు మొత్తం 112 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 29 మంది మహిళలు, 83 మంది పురుషులు ఉన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని, అనంతరం వారికి ఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తామని ఐజి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత, ఏలూరు ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ జి. మునిరాజా, అదనపు ఎస్పీ శ్రీ ఎల్. చెంచు రెడ్డి, రాజమహేంద్రవరం, పోలవరం డీఎస్పీలు, పెదవేగి డిటిసి డీఎస్పీ శ్రీ సిహెచ్.వి. ప్రసాద్ రావు, మచిలీపట్నం డీఎస్పీ శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ, డిఎఆర్ అధికారులతో పాటు రేంజ్ పరిధిలోని క్లూస్ టీమ్‌లు, ఐటీ కోర్ సిబ్బంది, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలు మరియు మహిళా ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.


