ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 08: పోలీస్ విధుల్లో ఉండగా అనారోగ్య కారణాలతో మరణించిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలుస్తూ ఏలూరు జిల్లా పోలీస్ శాఖ కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ స్వయంగా నియామక పత్రాలను అందించి కుటుంబాలకు ధైర్యం నూరిపోశారు.
ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సేవలో ఉండగానే మరణించిన ఇద్దరు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. పీసీ 1415 పి. శ్రీహరి గారు 07-06-2025న అనారోగ్యంతో మరణించగా, ఆయన కుమారుడు సాయి సుధాకర్‌కు కారుణ్య నియామకం కల్పించారు. అలాగే ఏఆర్ ఎస్ఐ 956 గొల్ల కొండలరావు గారు 27-05-2025న మరణించగా, ఆయన కుమారుడు గొల్ల సాయి సంతోష్‌కు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కారుణ్య నియామక విధానం ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల వారికి ఆర్థిక భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తన సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారు నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, సంబంధిత సిబ్బంది మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కారుణ్య నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.


