ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: బాలల హక్కుల సంరక్షణతో పాటు వారి సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు గాంధీబాబు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఏలూరు నగరంలోని పలు బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
జిల్లా శనివారపేటలో ఉన్న బాయ్స్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్‌లను పరిశీలించిన గాంధీబాబు, పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, రోజువారీ నిర్వహణ, ప్రభుత్వ సేవల అమలు పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు సక్రమంగా అందుతున్నాయా అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి, సంరక్షణ అవసరమైన బాలలపై అనుసరిస్తున్న విధానాలు, కేసుల పరిష్కార ప్రక్రియపై అధికారులతో చర్చించారు. బాలల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు స్నేహపూర్వకంగా, చట్టబద్ధంగా ఉండాలని సూచించారు.
విద్యానగర్ ప్రాంతంలోని శిశుగృహాన్ని కూడా సందర్శించిన ఆయన, అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలల వ్యక్తిగత కేస్ స్టడీలను పరిశీలించారు. వారి ఆరోగ్యం, భవిష్యత్ అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, జువెనైల్ వెల్ఫేర్ హోమ్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.


