ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 26: ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, ఏఆర్ అదనపు ఎస్పీ జీ. మునిరాజా సమక్షంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమం పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. మొత్తం 49 ఫిర్యాదులు అందగా, వాటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు. సమీప సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదు చేసుకోవచ్చని, meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు సత్యసాయి సంఘం సభ్యులు భోజన సదుపాయాలు కల్పించారు. ప్రజలకు చేరువగా సేవలందించాలనే లక్ష్యంతో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.


