ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: జిల్లాలో వరకట్న నిషేధ చట్టం–1961ను సమర్థవంతంగా అమలు చేసి మహిళలపై వేధింపులను అరికట్టాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా వరకట్న నిషేధ చట్ట అమలు కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా. ఎం.జె. అభిషేక్ గౌడ కూడా పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ వరకట్న వేధింపుల నివారణ, బాధితులకు తక్షణ సహాయం అందించడం ప్రధాన లక్ష్యంగా జిల్లా అడ్వైజరీ బోర్డు కమిటీ పనిచేయాలని తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చట్టం ఉద్దేశ్యం, శిక్షలు, బాధితులకు లభించే రక్షణ, సహాయక వ్యవస్థలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు.
వరకట్న వేధింపులకు గురైన మహిళలు ‘ఉమెన్ హెల్ప్‌లైన్ – 181’కు సమాచారం అందించవచ్చని, అలాగే ‘సఖి వన్ స్టాప్ సెంటర్’ ద్వారా ఉచితంగా న్యాయ, వైద్య, కౌన్సిలింగ్, పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు. గృహ హింస చట్టం కింద ఈ ఏడాది ఇప్పటివరకు 98 కేసులు నమోదు కాగా, 46 కేసులు పరిష్కరించబడ్డాయని, మరో 10 కేసులు కౌన్సిలింగ్ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు.
జిల్లాలో ఇప్పటికే ఏలూరులో పనిచేస్తున్న రెండు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో కూడా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మండల స్థాయిలో అడ్వైజరీ బోర్డు కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
వరకట్న నిషేధ చట్టం అమలులో పోలీసు, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ప్రజల్లో బలమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ఆర్డీవో ఐ. కిషోర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారి పి. శారద, డిఎస్పి యు. రవిచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, సోషల్ వెల్ఫేర్ డిడి వై. విశ్వమోహన రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసు, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



