తాజా వార్తలు

10/recent/ticker-posts

గృహ హింస బాధిత మహిళలకు ఉచిత సమగ్ర సేవలు – సఖి వన్ స్టాప్ సెంటర్ వినియోగంపై కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: గృహ హింసకు గురైన మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి సహాయం పొందాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల అమలుపై నిర్వహించిన త్రైమాసిక సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మహిళల భద్రత, గౌరవం, న్యాయం పరిరక్షణలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.


కలెక్టర్ మాట్లాడుతూ గృహ హింస, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు One Stop Centre (OSC) ద్వారా ఉచితంగా సమగ్ర సేవలు అందిస్తున్నామని చెప్పారు. పోలీసు, వైద్య, న్యాయ, కౌన్సిలింగ్ సేవలను ఒకే చోట అందిస్తూ బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నామని వివరించారు. మహిళలు ఎలాంటి భయం లేకుండా 181 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ కేసులు కలిపి 60 నమోదు కాగా, అందులో 40 కేసులు పరిష్కరించబడ్డాయని అధికారులు తెలిపారు. కొన్ని కేసులు రాజీ కాగా, మరికొన్ని కేసులు కౌన్సిలింగ్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే బాధితులను సురక్షితంగా ఉంచి, సఖి వన్ స్టాప్ సెంటర్‌లో కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

అదనంగా 112 (ఎమర్జెన్సీ సేవలు), 1091 (మహిళల పోలీస్ హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) వంటి నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వద్ద వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తోందని, అవసరమైన సేవలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ఆర్డీవో ఐ. కిశోర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారి పి. శారద, డిఎస్పి యు. రవిచంద్ర, డిఎంహెచ్ఓ డా. యు. శోభ, సోషల్ వెల్ఫేర్ అధికారి వై. విశ్వమోహన రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసు, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డా. సి.హెచ్. సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.