తాజా వార్తలు

10/recent/ticker-posts

“సిలికాన్ వ్యాలీకి పోటీగా… రాష్ట్రంలో ఏమి రాబోతోంది?”


ఏలూరు/భీమడోలు, పశ్చిమ వాహిణి, ఏప్రిల్ 13: ప్రపంచ ప్రఖ్యాత సిలికాన్ వ్యాలీకి ధీటుగా రాష్ట్రంలో ‘క్వాంటం వ్యాలీ’ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. భీమడోలు లోని శ్రీ మాధురి జూనియర్ మరియు వొకేషనల్ కళాశాల మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. గూగుల్, అసెంచర్, టాటా వంటి ప్రముఖ సంస్థలతో కలిసి ‘క్వాంటం వ్యాలీ’ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్షలా ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.

విద్యార్థులు మార్కుల కోసం కాకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పోటీ పడాలని మంత్రి సూచించారు. విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అందించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలు అలవర్చుకుని, తల్లిదండ్రులు మరియు గురువులకు గౌరవం తీసుకువచ్చేలా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

చెడుమార్గం తాత్కాలిక ఆనందం ఇచ్చినా భవిష్యత్తును దెబ్బతీస్తుందని, విద్యార్థి దశలో మంచి మార్గంలో నడిస్తే ఉన్నత స్థానం సాధించడం సులభమని మంత్రి పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు తప్పకుండా లభిస్తాయని, విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరాలంటే చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

ప్రతి మండలంలో ఇంటర్నెట్ సదుపాయాలను విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కూడా మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ కర్రే ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పార్థసారధి విద్యార్థులకు బహుమతులను అందజేశారు.