పోలవరం/జంగారెడ్డిగెడెం, పశ్చిమ వాహిణి, ఏప్రిల్, 13: మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని టిడిపి మహిళా నేత పూనెం శశికళ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త, దేశపు తొలి న్యాయశాఖ మంత్రి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో శశికళ మాట్లాడుతూ… కుల నిర్మూలన, సామాజిక సమానత్వం, మహిళల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన నిర్విరామ కృషి అపారమని అన్నారు. ఇటువంటి మహానాయకులు అరుదుగా పుడతారని, ఆయన పోరాటం ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.
బాబాసాహెబ్ నడిచిన నేల పవిత్రమైందని, ఆయన జీవితం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని శశికళ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, సమాన సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని తెలిపారు.
మన కోసం ఆయన సృష్టించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగడమే ఆయనకు ఇవ్వగలిగే నిజమైన నివాళి అని ఆమె అన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అందరికీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఘనంగా జోహార్లు అర్పించారు.


