ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) సంజీవనిలా మారుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేకమంది బాధితుల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. తమ అనారోగ్య సమస్యలను వివరించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు సమర్పించిన వారికి త్వరితగతిన ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో శనివారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 23 మంది లబ్దిదారులకు రూ.6,62,836 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా రూ.8,93,305 విలువైన నాలుగు ఎల్‌వోసిలను కూడా అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి, పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గంలో రూ.5,20,95,753 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశామని వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత మంది అవసరార్థులకు సహాయం అందించేందుకు కృషి కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, క్లస్టర్ మరియు డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.


