దమ్మపేట (కొమ్ముగుడెం), పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: దమ్మపేట మండలంలోని కొమ్ముగుడెంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పాత్ర పోషించారని అన్నారు. “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే నినాదంతో ఆయన చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
2001 ఏప్రిల్ 27న తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని, అనంతరం జరిగిన ఉద్యమాలు రాష్ట్ర సాధనకు దారి తీశాయని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిందని అన్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాడుతూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని, 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచులు సోయం సత్యవతి, కోమరం సుశీల, యాట్ల రామ్‌దాస్, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


