కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: ప్రపంచమంతా కీర్తించే మహామేధావి, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్తపేట బాబానగర్ కాలనీలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డా. అంబేద్కర్ అని కొనియాడారు. బాబానగర్ యువత అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు.
అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఆయన అందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అదే మార్గంలో దేశ అభివృద్ధికి కృషి చేయడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ కోనసీమ అభివృద్ధి, రైల్వే లైన్, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టుల కోసం పార్లమెంట్‌లో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్థానిక యువతను నేతలు ప్రత్యేకంగా అభినందించారు.


