తాజా వార్తలు

10/recent/ticker-posts

మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల జీతాల కోసం వినతి – వారంలో చెల్లిస్తామని కమిషనర్ హామీ


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీ ఎంఈఎఫ్) ఏలూరు నగర కమిటీ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. జీతాలు ఆలస్యం కావడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నాయకులు తెలిపారు.


ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు బి. సోమయ్య మాట్లాడుతూ, ప్రతి నెల 1 లేదా 2వ తేదీల్లో రావాల్సిన జీతాలు 8వ తేదీ అయినా రాకపోవడం బాధాకరమన్నారు. ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోవడంతో పాటు, పాలు, కిరాణా సరుకులు కొనుగోలు చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అలాగే బ్యాంకు లోన్లు, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతే వడ్డీలు, పెనాల్టీలు పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఏ. భాను ప్రతాప్ మాట్లాడుతూ, ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, సాంకేతిక కారణాల వల్ల జీతాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో చర్చించామని, ఒక వారంలోగా కార్మికుల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బి. సోమయ్య, అధ్యక్షులు లావేటి కృష్ణారావు, కార్యదర్శి జి. వెంకటేశ్వరరావు (బాలు)తో పాటు బండి రాజు, పంతం చిన్న నాగరాజు, అప్పారావు, అర్లప్ప, తానంకి జార్జి, బంగారు రమేష్, ఓ. కాంతమ్మ, బి. విమల కుమారి, లక్ష్మి, మరియన్న, ఒగ్గు శ్రీను, కే. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.