ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు యూనిట్‌లో సేవలందించి పదవీ విరమణ పొందిన సభ్యులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్ అవుతున్న హోంగార్డ్స్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమక్షంలో కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన హోంగార్డ్స్‌లో శ్రీ బొడిగడ్డ కోటేశ్వరరావు (హోం గార్డ్-145) 23 సంవత్సరాలు పైగా సేవలందించగా, శ్రీమతి సదర్ల లక్ష్మీ పేరంటాలు (మహిళా కంపెనీ కమాండర్-190) దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ సేవను పూర్తి చేశారు. అలాగే శ్రీ వంగడపు సూర్యనారాయణ (హోం గార్డ్-50) కూడా తన సేవా కాలాన్ని విజయవంతంగా ముగించారు. వారి సేవలను అధికారులు స్మరించుకున్నారు.
ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థ పోలీస్ శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందితో సమానంగా కృషి చేసి ప్రజాసేవలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి క్రమశిక్షణ, అంకితభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
పదవీ విరమణ అనంతరం వారి జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేసిన వారి కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. వారికి భవిష్యత్తులో సుఖశాంతులు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్ అయిన హోంగార్డ్స్‌కు సన్మానం చేసి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.



.jpeg)


