ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: పోలవరం సబ్ డివిజన్ డీఎస్పీగా సేవలందించిన శ్రీ మల్లూరి వెంకటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, డీఎస్పీని శాలువాతో సత్కరించి పుష్పమాలలు, జ్ఞాపిక అందజేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు గారు 34 సంవత్సరాలు 9 నెలలు 15 రోజుల సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు విశేష సేవలు అందించారని ప్రశంసించారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రారంభించి డీఎస్పీ స్థాయి వరకు ఎదగడం ఆయన క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనమని అన్నారు. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి, ఇసుక, సారాయి అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన తీసుకున్న చర్యలు జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆయన ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. ఆయన సేవలు రాబోయే తరాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
శ్రీ వెంకటేశ్వరరావు గారు 1964 ఏప్రిల్ 14న చత్రాయి మండలం తుమ్మగూడెం పంచాయతీ పరిధిలోని టి.గుడిపాడు గ్రామంలో జన్మించారు. నూజివీడు ధర్మా అప్పారావు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రాచీన భారత చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారు. 1991లో గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు.
1991 జూలై 15న సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరిన ఆయన, ఏలూరు టౌన్-I, భీమడోలు, తడికలపూడి, గణపవరం, అత్తిలి, జంగారెడ్డిగూడెం వంటి కీలక ప్రాంతాల్లో సేవలందించారు. 2010లో ఇన్‌స్పెక్టర్‌గా, 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగం, పోలవరం సబ్ డివిజన్‌లో విధులు నిర్వహించారు. తన సేవా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి నేడు పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం తనకు ప్రాణం లాంటిదని, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని, ఆయన నుంచి ఎల్లప్పుడూ సహకారం లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి. మునిరాజా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హబీబ్ బాషా, ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్ తదితరులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం భావోద్వేగపూరితంగా సాగింది.

.jpeg)


