చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: చింతలపూడి శ్రీ చైతన్య పాఠశాలలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600కి 593 మార్కులు సాధించిన విద్యార్థిని షేక్ హసీనా బేగం ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థినిని సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
మండల విద్యాశాఖ అధికారి కిరణ్ సమక్షంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. విద్య అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్న తేడా లేకుండా ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కిరణ్, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి వరలక్ష్మి ప్రసన్న, డీన్ చెన్నకేశవులు, బ్యాచ్ ఇంచార్జ్ మధు రవీంద్ర, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థిని అభినందించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.


