ఖమ్మం జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: మర్లపాడు గ్రామానికి చెందిన తుంగా విజయలక్ష్మి అనే దివ్యాంగ మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోరుతోంది. విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, గత 7 సంవత్సరాలుగా మహంకాళి జగన్నాధం అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలాన్ని నెలకు రూ.7,000 అద్దెకు తీసుకుని ఫ్రూట్స్ & జ్యూస్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో రూ.60,000 అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలిపింది.
ఇటీవల స్థల యజమాని అద్దెను ఒక్కసారిగా రూ.18,000కు పెంచాలని ఒత్తిడి తెచ్చారని, తాము అంగీకరించకపోవడంతో ఖాళీ చేయాలని బెదిరించారని ఆరోపించింది. ఈ క్రమంలో ఆయన అల్లుడు కొరిపల్లి నాగ సుబ్బారావు అకస్మాత్తుగా షాప్‌లోకి వచ్చి ఫ్రూట్స్, సామాన్లు బయటకు విసిరేయడం, ఫ్రిడ్జ్, విద్యుత్ మీటర్ ధ్వంసం చేయడం, కౌంటర్‌లో ఉన్న రూ.15,000 నగదు తీసుకెళ్లినట్లు ఆరోపించింది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని, పైగా స్థానిక ప్రభావశీలుల పేర్లు చెప్పి కేసులు పెట్టవద్దని సూచించారని పేర్కొంది. అలాగే భీమ్ రెడ్డి చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం పేరుతో రూ.1 లక్ష తీసుకుని సమస్య పరిష్కరించలేదని ఆరోపించింది.
ఇంకా, ఏప్రిల్ 5 అర్ధరాత్రి తన షాప్‌ను పూర్తిగా ధ్వంసం చేసి సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం కలిగించారని తెలిపింది. తిరిగి పోలీసులను ఆశ్రయించినా “సివిల్ మ్యాటర్” అంటూ కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎస్సీ/ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.


