కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: రాబోయే జనగణన 2027ను అందరూ విజయవంతం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు.
బుధవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వీయ జనగణన నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. తహసీల్దార్ యడ్ల రాంబాబు జనగణన పోర్టల్ ద్వారా నమోదు విధానం, ప్రాముఖ్యతను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి స్వీయ గణన పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పౌరుడు తప్పనిసరిగా జనగణనలో పాల్గొని స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. గడువు సమీపిస్తున్నందున ఇంకా నమోదు చేయని వారు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని కోరారు.
అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లోనే వివరాలు నమోదు చేయాలని, సరైన సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
జనగణన దేశ అభివృద్ధికి కీలకమని, రాబోయే రోజుల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


