దెందులూరు/దుగ్గిరాల, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: అప్పన్నవీడు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న 25వ హనుమాన్ జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మే 7 నుండి 12 వరకు జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఉత్సవాలు విజయవంతం కావాలని, ప్రజలందరిపై దైవ కృప ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ వేమూరి శ్రీనివాస్ సహా సభ్యులు, కూటమి నాయకులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, వివిధ కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు అందించారు.



