తాజా వార్తలు

10/recent/ticker-posts

మక్కజొన్న రైతులకు మద్దతు కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ


ఆంధ్రప్రదేశ్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కీలక లేఖ రాశారు. రాష్ట్రంలోని మక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మార్కెట్‌లో ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా పడిపోవడం రైతులకు భారంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఈ రబీ సీజన్‌లో మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. భారీ ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో సరఫరా అధికమై ధరలు మరింత క్షీణించే పరిస్థితి ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలతో పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ (Price Deficiency Payment) పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మార్కెట్ ధర మరియు MSP మధ్య తేడాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ పథకాన్ని రాష్ట్రంలో 100 శాతం ఉత్పత్తికి విస్తరించి, కనీసం 2026 జూన్ వరకు అమలు చేయాలని కోరారు.

రైతుల ఆదాయాన్ని స్థిరపరచడం మరియు నష్టాలను తగ్గించడం కోసం తక్షణ జోక్యం అవసరమని సీఎం స్పష్టం చేశారు. పంట కోతల గరిష్ట కాలంలో ధరలు ఇంకా పడిపోవచ్చని హెచ్చరించి, రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.