తాజా వార్తలు

10/recent/ticker-posts

దేవస్థానంలో “నకిలీ దర్శనం”… భక్తుల నమ్మకంతో ఆటలాడిన గుట్టు ఎలా బయటపడింది?


ద్వారకా తిరుమల, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. భక్తులకు కౌంటర్ ద్వారానే నకిలీ టికెట్లు విక్రయించిన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రూ.200 విలువ గల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.


ఈ ఘటనపై దేవస్థానం ఈవో భద్రాజీ ఫిర్యాదు చేయడంతో Cr.No.71/2026 కింద కేసు నమోదు చేశారు. ప్రారంభ దర్యాప్తులో టికెట్ కౌంటర్‌లో పనిచేసే సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు ఐనంపూడి సాయి జగన్నాథ రాజు పరారీలో ఉండటంతో కేసును సవాలుగా తీసుకుని పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సీఐ పి. కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్ఐ టి. సుధీర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడితో పాటు మరికొంతమంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.


దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్ విభాగంలో పనిచేసే ములగాల రమేష్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో నకిలీ టికెట్ల సాఫ్ట్‌వేర్ రూపొందించి, వాటిని ప్రింట్ తీసుకుని కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్లు తేలింది.

ఈ కేసులో మొత్తం 7 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే మరో ఇద్దరు నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి Dell ల్యాప్‌టాప్, TVS థర్మల్ ప్రింటర్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, దేవస్థానాల్లో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.