తాజా వార్తలు

10/recent/ticker-posts

విగ్రహాల భద్రతపై పోలీసుల అలర్ట్… గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసా?


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: జిల్లాలో ప్రముఖ నాయకుల విగ్రహాల సంరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఐపీఎస్ పర్యవేక్షణలో గ్రామస్థులు, విగ్రహ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.


జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ ఎం.ఈ. సుభాష్, తడికలపూడి మహిళా ఎస్‌ఐ వల్లి పద్మ కామవరపుకోట గ్రామంలో పర్యటించి విగ్రహాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు. విగ్రహాల వద్ద ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉండేలా చూడాలని అధికారులు తెలిపారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే నేరస్థులను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే రాత్రి సమయంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు.

విగ్రహాల వద్ద రాత్రిపూట కాపలా ఉండేలా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని, కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ ప్రజలు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విగ్రహాల రక్షణలో భాగస్వాములు కావాలని ఇన్‌స్పెక్టర్ సుభాష్ పిలుపునిచ్చారు.

మహిళా ఎస్‌ఐ వల్లి పద్మ మాట్లాడుతూ గ్రామ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భద్రతా నియమాలు పాటించడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.