ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దారుణ దాడి, హత్య ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏలూరు జిల్లా శాఖలు డిమాండ్ చేశాయి.
ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, జర్నలిస్టుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలను ప్రజలకు అందించే బాధ్యత నిర్వహిస్తున్న జర్నలిస్టులు కూడా ఇలాంటి దాడులకు గురవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. సమాజ ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టులు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియాకు తగిన రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. శంకర్రావు, సీనియర్ నాయకుడు కె. బాలసౌరి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్.డి. జబీర్, కార్యదర్శి వై.వి. హరీష్, ఏపీబీజేఏ అధ్యక్షుడు పి. నారాయణరావు, కార్యదర్శి కిరణ్ తదితరులు ఈ ఘటనను ఖండించారు.


