ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 5: బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ జీ. మునిరాజా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జీ. మునిరాజా మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చంద్వా గ్రామంలో జన్మించిన డా. బాబు జగ్జీవన్ రామ్ సామాన్య రైతు కుటుంబం నుంచి ఎదిగి దేశ రాజకీయాల్లో అగ్రగామిగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన తల్లిదండ్రులు శోబీ రామ్, వసంతి దేవి అని తెలిపారు.
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన, దళితుల హక్కుల కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారని చెప్పారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా ఆయన పాత్ర విశేషమని, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఆయన, కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖలను సమర్థంగా నిర్వహించారని తెలిపారు. 1977–79 మధ్య ఉప ప్రధానమంత్రిగా సేవలందించి దేశానికి విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
1946లో జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక కేబినెట్‌లో యువ మంత్రిగా ప్రవేశించి, 1952 నుంచి 1986 వరకు నిరంతరంగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కూడా సేవలందించినట్లు వివరించారు.
డా. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు, ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ పవన్ కుమార్, ఏఆర్‌ఎస్‌ఐ వెంకటేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


