ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 5: ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను విస్తరించిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 6వ తేదీ సోమవారం నుంచి ఈ సేవలు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా PGRS మరియు రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రానికి పరిమితమైన ఫిర్యాదుల స్వీకరణ విధానాన్ని ప్రభుత్వం వికేంద్రీకరించడం ద్వారా ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.
ఇకపై ప్రజలు తమ సమస్యలను సమీప మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల దూర ప్రయాణం అవసరం లేకుండా స్థానికంగానే ఫిర్యాదులు అందజేసే వీలుంటుందని పేర్కొన్నారు.
అదనంగా, ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. అలాగే ఫిర్యాదు స్థితి తెలుసుకోవడానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసే సౌకర్యం కల్పించబడింది.
ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదులు త్వరితగతిన సంబంధిత అధికారులకు చేరి సమయానుకూలంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


