తాజా వార్తలు

10/recent/ticker-posts

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలి


క్వింటాల్ రూ.2,400 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్..


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 18: జిల్లాలో కమర్షియల్ మొక్కజొన్న రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని ఎకరాకు 20 వేల నుండి 30 వేల రూపాయలు నష్టపోతున్నారని, మధ్య దళారుల దోపిడీకి గురవుతున్నారని, రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ కు రూ.2,400 లు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

శనివారం ఆయన ఏలూరు అన్నే భవనంలో మొక్కజొన్న కొనుగోలు సమస్యలపై మాట్లాడారు. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని,  కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కేటాయించమని అడుగుతున్నామని కేంద్రం నుండి నిధులు, కొనుగోలుకు ఉత్తర్వులు వచ్చిన వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే  మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న పలుకుబడి ఉపయోగించి నిధులు రాబట్టాలేని దీనస్థితిలో ఉండడం బాధాకరమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులు సమీకరించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.